Architecture Engineering: ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్‌తో మంచి కెరీర్ అవకాశాలు సొంతం.. 7 d ago

ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్:
నిర్మాణ రంగంలో ఆర్కిటెక్టుల సేవలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆర్కిటెక్చర్ విభాగంలో సేవలు అందించడానికి యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్ధాయుల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేసుకున్నవారు ఆర్కిటెక్చర్లుగా రాణించగలరు. ఆర్కిటెక్చర్ కోర్సుకున్న ప్రాధాన్యం నేపథ్యంలో దేశంలో ఈ చదువులు అందిస్తోన్న మేటి సంస్ధలు ప్రవేశ మార్గాలు, ఉద్యోగావకాశాలను తెలుసుకుందాం...
కొన్ని నిర్మాణాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. చూపుల్ని తిప్పుకోనివ్వవు. ఇప్పుడు ఆధునిక కట్టడాలు ఆకాశహర్మ్యాల్లా మేఘాలను తాకుతూ ఔరా అనిపిస్తున్నాయి. వీటి వెనుక నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. నిర్మాణం ఏదైనప్పటికీ దాని రూపశిల్పులు ఆర్కెటెక్చర్లే. ఆర్కిటెక్చర్లు నిర్మాణ రంగానికి సృజనాత్మకత జోడిస్తారు. ఆకట్టుకునేలా ఆకృతి (డిజైన్) రూపొందించడం వీరి ప్రధాన విధి. ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి నిర్మాణ, స్ధిరాస్తి సంస్ధల్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ విభాగాలు, రైల్వే, రక్షణ శాఖ, ఏయిర్‌పోర్ట్ అథారిటీ, హౌసింగ్ బోర్డులు, కార్పొరేషన్లు, కార్పొరేట్ సంస్ధలు.. మొదలైన చోట్ల ఉద్యోగాలు ఉంటాయి.
జేఈఈ ఆర్క్ స్కోరుతో...
బీఆర్క్‌లో చేరడానికి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ( మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూపు తీసుకున్న వారు అర్హులు బైపీసీ లేదా ఇతర గ్రూపులు చదివిన వారు బీఆర్క్ కోర్సులకు అర్హలు కాదు. దేశవ్యాప్తంగా వివిధ సంస్ధలు ఆర్కిటెక్చర్‌లో బీఆర్క్, ఎంఆర్క్, పీహెచ్‌డీ కోర్సులు అందిస్తున్నాయి. చాలా ఐఐటీలు బీఆర్క్‌లో భాగంగా ఆర్కిటెక్చర్ కోర్సులు నడుపుతున్నాయి. ఐఐటీ-జేఈఈ ఆర్కిటెక్చర్ స్కోరుతో కోర్సులో ప్రవేశం అభిస్తుంది. పీజీలో కూడా సిటీ ప్లానింగ్, సస్టెయినబుల్ బిల్ట్ ఎన్విరాన్‌మెంట్ ఇలా పలు స్పెషలైజేషన్ కోర్సులు ఉన్నాయి. వీటిలో గేట్ స్కోర్‌తో చేరవచ్చు. కొన్ని సంస్దలు నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా)తో అవకాశం కల్పిస్తున్నాయి.
మేటి సంస్ధలు…
దేశంలో మొత్తం 25 సంస్ధలకు ర్యాంకులు కేటాయించగా బోధన, పరిశోధనల్లో మొదటి స్ధానంలో ఐఐటీ రూర్కెలా ఆర్కిటెక్చర్ విభాగంలో ప్రధమ స్ధానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ 8వ స్ధానంలో నిలిచింది.
ఐఐటీ రూర్కెలా, ఎన్ఐటీ కాలికట్, ఐఐటీ ఖరగ్‌పూర్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ - న్యూదిల్లీ , సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్‌ల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ-అహ్మదాబాద్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్-భోపాల్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-తిరుచిరాపల్లి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్- విజయవాడ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-షిబ్‌పూర్, జామియా మిల్లియా ఇస్తామియా-న్యూదిల్లీ.
బీఆర్క్‌తో అవకాశాలు:
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(బీఆర్క్) సృజనాత్మకత, సాంకేతికత, అభిరుచిని కలిపిన ప్రొఫెషనల్ కోర్సు. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్ధులకు నిర్మాణ రంగంలో, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో, స్వతంత్రంగానూ అనేక ఉపాధి అవకాశాలుంటాయి. ప్రభుత్వ రంగంలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్లు, పబ్లిక్ వర్క్స్, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల్లో కొలువులు ఉన్నాయి. ప్రైవేటు రంగంలో ఆర్కిటెక్చర్ సంస్ధలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఇంటీరియర్ డిజైన్ కంపెనీలు, కన్సల్టెన్సీ సంస్ధలు అవకాశాలు కల్పిస్తున్నాయి. హైరైజ్ బిల్డింగ్స్, గ్రీన్ బిల్డింగ్స్, సస్టెయినబుల్ ఆర్కిటెక్చర్ వంటి ప్రత్యేక రంగాల్లో నైపుణ్యం పెంచుకుంటే అంతర్జాతీయ స్ధాయిలోనూ అవకాశాలు ఉంటాయి.
బీఆర్క్ తర్వాత ఎంఆర్క్ తో ఉద్యోగావకాశాలు:
బీఆర్క్ తర్వాత ఎంఆర్క్ చదివితే ఉద్యోగావకాశాల పరిధి పెరుగుతుంది. ఎంఆర్క్‌లో సస్టెయినబుల్ ఆర్కిటెక్చర్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, అర్బన్ డెవలప్‌మెంట్ లాంటి స్పెషలైజేషన్లలో నచ్చిన కోర్సుని ఎంచుకోవచ్చు. ఎంఆర్క్ విద్యార్హతతో రీసెర్చ్, టీచింగ్ రంగంలోనూ ప్రవేశించవచ్చు. ఎంప్లాన్ (మాస్టర్ ఆఫ్ ప్లానింగ్)లో అర్బన్, ట్రాన్స్‌పోర్ట్, రీజినల్, హౌసింగ్ ప్లానింగ్ రంగాల్లో స్పెషలైజేషన్ చేస్తే ప్రభుత్వ/ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. సస్టెయినబుల్ డిజైన్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఆటో క్యాడ్, రెవిట్, లీడ్ సర్టిఫికేషన్ వంటి సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులు చేస్తే, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇది చదవండి: ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌ను కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకొంటే?